రేపు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడనున్న భారత్.. జట్టులో పలు మార్పులు, కీలకం కానున్న విరాట్ కోహ్లీ

భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్‌ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. కాగా దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక టెస్టు ఫార్మాట్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టులు భారత్‌కు కీలకంగా మారాయి. ఇక రెండో టెస్ట్ డిసెంబర్ 22 నుంచి ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది.

తొలి టెస్టుపై దృష్టి సారించిన టీమిండియా పలు కీలక మార్పులు చేసింది. గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా చటేశ్వర్ పుజారా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే గాయాలతో సిరీస్ మొత్తానికి దూరమైన సీనియర్లు మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో యువ ఆటగాళ్లు నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. జయదేవ్ ఉనద్కత్‌ కూడా జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నాడు. ఇటీవల విరాట్ ఫామ్ అందుకోవడం జట్టుకి కొండంత బలాన్నిస్తోంది.

విరాట్ కోహ్లీకి తోడు చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇక బౌలర్లలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లు కీలకం కానున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తుండగా మొమినుల్ హక్, యాసిర్ అలీ, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ మరియు ముష్ఫికర్ రహీమ్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. అలాగే తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, మరియు షోరిఫుల్ ఇస్లామ్ తదితరులు బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

తొలి టెస్టుకి జట్లు అంచనా..

భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ శాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరి, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + sixteen =