ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.. తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

Telangana Govt Issues Key Guidelines For Indiramma Family Life Insurance Scheme

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (IKJBP) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (నవంబర్ 20) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఇప్పటికే అమలులో ఉన్న జీవిత బీమా మరియు ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఆ పథకాల పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేయాలని ఆదేశించింది.

ఈ పథకం కింద ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే బీమా రక్షణ కల్పిస్తారు. కుటుంబ పెద్ద లేదా కుటుంబాన్ని పోషించే సంపాదించే వ్యక్తి ఈ బీమా పరిధిలోకి వస్తారు. నమోదైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో వారి నామినీ(ల)కు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.

బీమా నమోదు కోసం ప్రతిపాదిత వ్యక్తి స్వయంగా ప్రత్యేక శిబిరానికి హాజరై తమ నామినీల వివరాలను అందిస్తేనే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అనారోగ్యం లేదా దివ్యాంగులై శిబిరాలకు హాజరు కాలేని వారి విషయంలో శిబిరం ఇన్‌ఛార్జి స్వయంగా వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

నమోదు సమయానికి లబ్ధిదారుని వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలని, ఇందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపింది. ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జులై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని, ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉంటే సరిచేయించుకున్న తర్వాతే నమోదు చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఈ పథకం నమోదు ప్రక్రియ పూర్తిగా ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఓటీపీ (OTP) ఆధారిత ధ్రువీకరణతో సాగుతుంది. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, తెలంగాణలో జారీ అయిన రేషన్ (ఆహార భద్రత) కార్డు ప్రతులతో పాటు మొబైల్ ఫోన్ నంబరును తప్పనిసరిగా అందించాలి. రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా, ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగిస్తారు.

ఒకవేళ రేషన్ కార్డుకు ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్‌లో ఉంటే ఆ ప్రక్రియను పూర్తి చేసుకుని రావాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే రూ. 5 లక్షలలో ఎవరికి ఎంత శాతం సొమ్ము చెల్లించాలో ముందే తెలియజేయాలి; నామినీ మైనర్ అయితే వారి తరఫున క్లెయిమ్ స్వీకరించడానికి మేజర్ అయిన సంరక్షకుని పేరు నమోదు చేయాలి.

బీమా కవరేజీ ప్రారంభమైన తేదీ నుంచి ఆ పాలసీ సంవత్సరం ముగిసే వరకు బీమా రక్షణ అమల్లో ఉంటుందని, ఆ మధ్యలో గరిష్ఠ వయోపరిమితి దాటినా ఆ ఏడాది ముగిసే వరకు కవరేజీ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ నమోదు శిబిరాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని, అదనపు కలెక్టర్ లేదా సీనియర్ అధికారిని జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించింది.

అలాగే మండలాలు, పురపాలికలకు జిల్లా స్థాయి అధికారులను, ప్రతి గ్రామ పంచాయతీ మరియు వార్డులకు తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను సమన్వయ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here