తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కొళత్తూరు నియోజకవర్గ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం (నవంబర్ 19) కన్నుమూశారు.
శ్వాసకోస సంబంధిత దీర్ఘకాలిక సమస్యతో సెప్టెంబర్ 9న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, 70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వైద్య బృందం అన్ని విధాలా శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి, కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా, 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కంచుకోట అయిన కొళత్తూరులో వీఎస్ బాబు విజయం సాధించడం తమిళనాడు రాజకీయాలను కుదిపేసింది. 2011 నుంచి కొళత్తూరు నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన స్టాలిన్‌పై వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. టీవీకే అధినేత విజయ్ పార్టీలో చేరిన కొద్దికాలంలోనే స్టాలిన్‌పై పోటీ చేసి గెలవడం ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నేతగా నిలిచారు.
వీఎస్ బాబుకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. గతంలో డీఎంకే ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శిగా పని చేసిన ఆయన, 2006లో డీఎంకే తరఫున పురసైవాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2011లో స్టాలిన్ తొలిసారి కొళత్తూరు నుంచి పోటీ చేసినప్పుడు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2016 జూన్‌లో అన్నాడీఎంకేలో చేరిన వీఎస్ బాబు, ఈ ఏడాది ఫిబ్రవరి 7న టీవీకేలో చేరి కొళత్తూరు నుంచి బరిలోకి దిగి సంచలనం సృష్టించారు.
వీఎస్ బాబు మృతి పట్ల తమిళనాడు రాజకీయ ప్రముఖులు, టీవీకే నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర చెన్నై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే వారని పలువురు నేతలు గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కొళత్తూరు నియోజకవర్గంలో, టీవీకే శ్రేణుల్లో విషాదఛాయలు అలముకున్నాయి.






































