తెలంగాణలోని రెండు పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది అర్హులైన పట్టభద్ర ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చారు.
వీరిలో 7,10,652 మంది పురుషులు, 4,78,528 మంది మహిళలు, 11 మంది ఇతరులు (థర్డ్ జెండర్) ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తులు రాగా, వాటిలో 5,68,105 దరఖాస్తులను ఆమోదించి 31,314 దరఖాస్తులను తిరస్కరించారు.
ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 6,70,407 దరఖాస్తులు అందగా, 6,21,086 మందిని ముసాయిదా జాబితాలో చేర్చి 49,321 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 12,69,826 దరఖాస్తులలో 80,635 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈఓ అధికారిక వెబ్సైట్ ceotelangana.nic.in తో పాటు సంబంధిత అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాపై డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. జాబితాలో పేరు లేని అర్హులైన పట్టభద్రులు కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-18 సమర్పించాలని, వివరాల సవరణలకు ఫారం-8, తొలగింపు అభ్యంతరాలకు ఫారం-7 ఉపయోగించాలని అధికారులు సూచించారు.
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిశీలన అనంతరం డిసెంబర్ 30న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఆయా నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఫారం-18 ద్వారా కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు; రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,703 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఆమోదించింది.





































