ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా.. విజేతలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు

Minister Nara Lokesh Congratulates TDP Leaders After Phase 1 Panchayat Poll Wins

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం పంచాయతీ ఎన్నికల వరకు కొనసాగుతోందని పేర్కొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

తొలి విడతలో విజయం సాధించామని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, రానున్న రెండు, మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని లోకేశ్ సూచించారు. బలం ఉందని రిలాక్స్ కావద్దని, చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఎన్నికను సీరియస్‌గా చూడాలని స్పష్టం చేశారు. పోలింగ్ ఎంత ఎక్కువగా జరిగితే తమ మెజారిటీలు అంత ఎక్కువగా పెరుగుతాయని, గత ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలని కోరారు.

జనసేన, బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా అవసరమైన నియోజకవర్గాల్లో సేవలందించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. బలహీనంగా ఉన్న చోట గెలవాలని, బలంగా ఉన్న చోట మరింత మెజారిటీ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

వరుస ఓటములతో ప్రత్యర్థి పార్టీ అసహనంతో హింసకు పాల్పడుతోందని, వారు చేసే దాడులు, కుట్రల పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని నారా లోకేశ్ హెచ్చరించారు. తదుపరి విడతల పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, క్రమశిక్షణతో కూటమి విజయాన్ని ఖాయం చేయాలని దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here