నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు, హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మిస్తాం

Centenary Celebrations of Former PM PV Narasimha Rao, CM KCR Review Meeting, Ex PM PV Narasimha Rao, Former PM PV Narasimha Rao, PV Narasimha Rao, PV Narasimha Rao birth centenary, PV Narasimha Rao birth centenary celebrations, PV Narasimha Rao Centenary, PV Narasimha Rao Centenary Celebrations, Telangana CM KCR

సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

‘‘పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తాం. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీ గురించి విస్తృత చర్చ చేయాలని నిర్ణయించాం. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేస్తాం. అసెంబ్లీలో పీవీ నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం–చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం. భారత పార్లమెంటులో కూడా పీవీ పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. హైదరాబాద్ లో పీవీ నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

‘‘ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉత్పత్తి సాధనం, ఉపాధి మార్గం అయిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారు. దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పేదల చేతికి భూమి వచ్చింది. పీవీ ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంది. అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి’’ అని కమిటి సభ్యులకు సీఎం సూచించారు.

ఈ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:

–> నెక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన మార్గ్ గా అభివృద్ధి చేయాలి. ఆ మార్గమంతా అందమైన ఉద్యానవనాలు నిర్మించాలి. పీవీ విగ్రహం పెట్టాలి.

–> పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళిక తయారు చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం ఆదేశించారు.

–> హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేయాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ జీవితమంతా వివిధ రంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.

–> పీవీ నరసింహరావు పేరు మీద విద్యావైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలి. అవార్డుకు సంబంధించిన నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

–> పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిర్వహించాలి. ఇప్పటికే అమెరికా, సింగపూర్, సౌతాఫ్రికా, మలేసియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా దేశాల్లో కూడా కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించాలి.

–> పీవీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షులు జాన్ మేజర్, కామెరూన్ తదితరులను కూడా భారతదేశానికి ఆహ్వానించి, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలి.

–> భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖలు రాస్తారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తారు.

–> ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహం పెట్టాలి. ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పీవీకి ఎక్కువ అనుబంధం, అక్కడి వారితో పరిచయాలు ఉన్న నేపథ్యలో ఆయా ప్రాంతాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి.

-> కేవలం హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించాలి.

–> అముద్రితాలుగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరుఫున ముద్రించాలి. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ప్రత్యేక పుస్తకం తీసుకురావాలి. పీవీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతులకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక పుస్తకం ముద్రించాలి. పీవీ జీవిత విశేషాలతో కాఫీ టేబుల్ బుక్ తయారు చేయాలి.

–> పీవీ జీవిత విశేషాలకు సంబంధించి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించాలి. తెలంగాణ సంబురాలు నిర్వహించిన తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుత వంటకాలతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించాలి.

–> ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడానికి పీవీ విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలి.

–> పీవీఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.

–> పీవీ నరసింహారావు రచించిన పుస్తకాలను, పీవీ మీద ప్రచురితమైన పుస్తకాలను సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ కు పీవీ కుమార్తె వాణిదేవి అందించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస గౌడ్, పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటి అధ్యక్షుడు, ఎంపి కె.కేశవ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కమిటీ సభ్యులు రమణాచారి, దేవులపల్లి ప్రభాకర్ రావు, టంకశాల అశోక్, పీవీ ప్రభాకర్ రావు, శ్రీమతి వాణిదేవి, కె.రామచంద్రమూర్తి, మహేష్ బిగాల, వైవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =