పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసుకోవాలి : సీఎం కేసీఆర్

CM KCR Review Meeting, CM KCR Review Meeting Over Palamuru Rangareddy Lift Irrigation Scheme, KCR Over Palamuru Rangareddy Lift Irrigation Scheme, Mango News, Palamuru Rangareddy Lift Irrigation, Palamuru Rangareddy Lift Irrigation Scheme, Palamuru Rangareddy Lift Irrigation Scheme News, Palamuru Rangareddy Lift Irrigation Scheme updates, Palamuru Rangareddy Lift Irrigation Scheme Works, Progress of Works on Palamuru Rangareddy Lift Irrigation Scheme, Telangana CM KCR

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతిపై, పనులను మరింత వేగవంతం చేయడంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆదివారం నాడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగులో పెట్టినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ పెండింగు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం. జూరాలతో సహా ఇప్పటికే మనం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని దక్షిణ పాలమూరు కు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొరవలు (కొసరు పనులు) మిగిలినయి. వాటిని ఎట్లా అతి త్వరలో పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయనా సరే, పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

గోదావరి నదీ ప్రవాహానికి కృష్టా నదీ ప్రవాహానికి తేడా వుంటుందని, సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే, కృష్టా నదీ ప్రవాహం తగ్గుతూ వస్తుంటదని విశ్లేషించారు. రాను రాను వర్షాలు తగ్గిపోవడం దానికి తోడు కృష్టా నదిమీద ఎగువన కర్ణాటక మహారాష్ట్రలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూముల వలన కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్కనీరు పోకుండా వడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టా నదిమీది అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేసుకోవాల్సిందేనని సీఎం జల వనరుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. కృష్టా జలాలను మలుపుకోని పాలమూరును పూర్తిస్తాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామని చెప్పారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే రైతన్నలకు వ్యవసాయ రంగానికి అంతమంచిదని, ఈ పథకాన్ని జూరాలకు లింక్ చేసుకోవచ్చని వివరించారు.

పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూ సేకరణ, పునరావాసం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, కాలువల తొవ్వకం, పంపుల ఏర్పాటు, తదితర నీటి సరఫరా పనులకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించారు. భూసేకరణ కోసం పునరావాసం కోసం చెల్లించాల్సిన డబ్బు ఎంత అవసరం? ఇంకా భూసేకరణ సహా పెండింగులో వున్న పనుల వివరాలేమిటి? మొత్తం రిజర్వాయర్లు ఎన్ని నీటి నిల్వ పెంచుకోవడానికి వాటిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరమున్నదా? వాటిల్లో పూర్తిస్తాయి నిల్వ సామర్థ్యం ఎంత? అనే విషయాల మీద సీఎం సుదీర్ఘంగా చర్చించారు. అక్కడక్కడా పనులు నిమ్మలంగా నడుస్తుండడం పట్ల సీఎం స్పందించి, మరింత శ్రద్ధగా పనులు పూర్తిచేయాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద ఏర్పాటు చేయాల్సిన పంపులను త్వరలో బిగించాలన్నారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ పనుల పూర్తికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజనీర్లను ఆరాతీసారు. జూన్ నెలాఖరు కల్లా పనులు పూర్తి కావాలన్నారు. వట్టెం నుంచి కరివేనకు వరకు కనాల్ పనులెంతవరకు వచ్చాయని, కాల్వ లైనింగ్ కోసం జరుగుతున్న పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

కావాల్సినన్ని నిధులను ప్రభుత్వం అందిస్తున్నాకూడా పనుల జాప్యం పట్ల అధికారులను ప్రశ్నించిన సీఎం, ఇక నుంచి పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్దం కావాలని స్పష్టం చేశారు. వారం వారం సమీక్షలు జరుపుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు స్మతా సభర్వాల్, రజత్ కుమార్, మురళీధర్ రావులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వడి వడిగా జరిగాయో అర్థం చేసుకోని, అదే స్పూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖలో వివిధ స్థాయి అధికారులకు నిధులను అందుబాటులో వుంచిందని సీఎం గుర్తు చేసారు. హైదరాబాద్ వరకు రానవసరం లేకుండా ఎక్కడి అధికారి అక్కడనే తమ నిధులను ఖర్చు చేస్తూ పనులను చేపట్టే వెసులుబాటు కల్పించిందన్నారు. అంతగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ ఇంజనీర్లు మనసుపెట్టి పనిచేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ తెలంగాణకు లైఫ్ లైన్ వంటిదని సీఎం కితాబిచ్చారు.

ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఇఎన్సీ మురళీధర్ రావు, సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఎస్.ఈలు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =