హైదరాబాద్ లో మళ్ళీ లాక్‌డౌన్ పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం

CM KCR, GHMC Lockdown, hyderabad lockdown, Hyderabad lockdown news, Hyderabad Lockdown Rules, Lockdown in GHMC, Lockdown in GHMC Limits, Lockdown in GHMC Limits with in Few Days, Lockdown in Greater Hyderabad, Lockdown in Hyderabad, Telangana CM KCR

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 28, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జీహెఛ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని సీఎం వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులను వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ‘‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని ఈటల రాజేందర్ వివరించారు.

“వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె వెల్లడించారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా తేలిన వారికి తగు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అలాగే జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జీహెఛ్ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

అనంతరం సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ‘‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశ పరిచి, జీహెఛ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని” చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =