ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో అన్ని రకాల సేవలు అందిస్తాం – పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ హామీ

Minister Nara Lokesh Promises WhatsApp Services For Industries in AP

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో మరో మైలురాయి నమోదైంది. శ్రీసిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఏసీ తయారీ సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బలమైన సంకేతాన్ని పారిశ్రామికవేత్తలకు పంపారు.

పారిశ్రామికవేత్తలకు ‘వాట్సాప్’ సేవలు

పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఏ అవసరమున్నా కేవలం ఒక ‘వాట్సాప్ మెసేజ్’ చేస్తే స్పందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఈ నెలాఖరులోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

శ్రీశక్తికి నిదర్శనం – స్థానికులకు ప్రాధాన్యం

శ్రీసిటీలో ప్రస్తుతం పనిచేస్తున్న 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలే ఉండటం గర్వకారణమని, ఇది ‘శ్రీశక్తి’కి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు. అయితే, ఇక్కడి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని కొందరు అర్థం చేసుకోకపోయినా, ఆయన నిశ్శబ్దంగా లక్ష్యాలను సాధిస్తూనే ఉంటారని లోకేశ్ పేర్కొన్నారు.

రూ.1,000 కోట్ల పెట్టుబడి – 3 వేల మందికి ఉపాధి

శ్రీసిటీలోని ఆరూరు వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ యూనిట్ నిర్మితమవుతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుంది. భారతదేశంలో క్యారియర్ సంస్థ విక్రయించే ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీ నుంచే సరఫరా కావడం విశేషం. ఇక్కడ సాధారణ ఏసీలతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 5,000 టన్నుల సామర్థ్యం గల భారీ కూలింగ్ సిస్టమ్స్‌ను కూడా తయారు చేయనున్నారు.

ఘన స్వాగతం

అంతకుముందు ఈ ఉదయం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. పారిశ్రామిక వాడకు చేరుకున్న ఆయన అక్కడున్న ప్రతిఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఉత్సాహంగా వారితో ఫొటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here