తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’ను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో క్రీడా పోటీల ఏర్పాట్లపై ఆయన విస్తృతంగా చర్చించారు.
డిసెంబరులో జరగనున్న ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరుకానున్న నేపథ్యంలో.. వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, రవాణా, క్రీడా మైదానాలు, ఇతర సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని ప్రస్తుత క్రీడా మైదానాల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని భవిష్యత్తులో జరిగే జాతీయ, అంతర్జాతీయ పోటీలకు కూడా ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్రీడాకారులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని చాటేలా, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠను పెంచేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాట్స్ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.







































