తమిళనాడులో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ కోసం దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా అనేక చర్యలు తీసుకున్నాయని సీఎం విజయ్ తెలిపారు. ఇప్పుడు అదే ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను తగ్గిస్తే లేదా ప్రాతినిధ్యం దెబ్బతింటే.. జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలే నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా జరిగే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.
కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లు
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం విజయ్ మూడు ప్రధాన డిమాండ్లను ప్రతిపాదించారు. లోక్సభ స్థానాల సంఖ్యను 543 వద్ద శాశ్వతంగా కొనసాగించాలని, ప్రస్తుతం రాష్ట్రాలకు ఉన్న ఎంపీ సీట్ల సంఖ్యను భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు.
అదే సమయంలో రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మాత్రం తమ వైఖరి స్పష్టంగా ఉందని సీఎం విజయ్ వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన
లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాలు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలో వెనుకబడిన రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో రాజకీయ పరిణామాలతో ఎన్డీయే బలం పెరిగిందన్న చర్చల నేపథ్యంలో కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.






































