ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ- మంత్రి కేటీఆర్

KTR Latest News, KTR Meeting IT Officials and Industries Department, Mango News Telugu, Minister KTR Review Meeting, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019
  • తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
  • ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11569 కంపెనీలకు అనుమతులు
  • సుమారు 6లక్షల మందికి ఉద్యోగాల కల్పన
  • మరింత ఉపాధి కల్పనే లక్ష్యంగా టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెడతాం
  • ఇప్పటికే టెక్స్‌టైల్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుడబడులకు పలు అంతర్జాతీయ కంపెనీల ఆసక్తి
  • పెట్టుబడుల సేకరణకు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు డిసెంబర్ 17, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో పరిశ్రమలు, ఐటీ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని, టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటిదాకా 11569 కంపెనీలు అనుమతులు ఇచ్చామని, ఇందులో సుమారు 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, దీని ద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా, ఉపాధి కల్పనకు అధిక అవకాశాలున్న టెక్స్‌టైల్ రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యత

రాష్ట్రంలో టెక్స్‌టైల్ పరిశ్రమకి అనుకూలమైన పరిస్థితులున్న నేపథ్యంలో ఈ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత రంగ పరిశ్రమ గుర్తింపు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే దేశంలోని అతిపెద్ద మెగా టెక్స్‌టైల్ పార్కుని వరంగల్ లో ప్రారంభించిందని, కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్ ఇక్కడ భారీ యూనిట్ ఎర్పాటు చేస్తున్నదని తెలిపారు. దీంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గురించి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈమధ్యనే బెంగళూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించినట్లు, అవసరమైతే మరిన్ని సమావేశాలను వివిధ నగరాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే వన్ ప్లస్, స్కైవర్త్ వంటి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు, బ్యాటరీ తయారీ వంటి వాటి పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ప్రస్తుతం పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందు వలన రాష్ర్టంలో వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడుల ద్వారా వ్యవసాయ రంగానికి భరోసాతో పాటు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ మూడు రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మూడు రంగాల్లో నూతనంగా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని పరిశ్రమల శాఖ, ఐటి శాఖ డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల కోసం అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ మరియు ఇండస్ట్రియల్ పార్కుల వివరాలతో కూడిన సమగ్ర సమాచారం పెట్టబడులు పెట్టేందుకు ముందకు వచ్చేవారి కోసం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ మూడు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రాథమికంగా చర్చలు చేసిన లేదా ఆసక్తి చూపించిన కంపెనీలను ఫాలోఅప్ చేయాలని ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకొని పరిశ్రమలను తెలంగాణకు రప్పించేందుకు ఐటి మరియు పరిశ్రమల శాఖలు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ డైరెక్టర్లు, టిఎస్ఐఐసి ఎండీ వెంకట నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 8 =