మూడు రాజధానుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన

Amaravati, Andhra Pradesh 3 Capitals, AP CM YS Jagan, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, AP Three Capitals, Chief Minister of Andhra Pradesh, CM YS Jagan 3 Capitals Decision, Kurnool, Mango News Telugu, Pawan Kalyan Latest News, Pawan Kalyan On AP 3 Capitals, Three Capitals For AP, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయంపై మంగళవారం నాడు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు. మరి జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు. కమిటీ రిపోర్ట్‌ రాకమునుపే జగన్‌రెడ్డి మూడు రాజధానులపై అభిప్రాయం చెప్పేశారు. ఇలా అయితే అసలు కమిటీలు వేయడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చేయడం దేనికి? ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా? మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి. హైకోర్ట్ కర్నూల్ లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా? ‘ అంటూ వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.

‘సీజన్లో, కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెలేలు లెజిస్లేటివ్ రాజధానికి వాలి వెళ్ళాలన్నమాట. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి ఆ తరవాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి గారు ఆలోచనలా ఉంది. అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటు పడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా?. రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమే. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారని’ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఒక వ్యూహం ప్రకారమే అసెంబ్లీలో ప్రకటన

‘సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు. నేను పోరాట యాత్రలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలా వరకు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు. విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారు. అలాగే వివాదాస్పద భూముల పంచాయతీలు మొదలు పెట్టారు. విలువైన భూముల రికార్డులు లేవు. వాటిపై కఠినంగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ను ఆగమేఘాలపై తప్పించి అక్కడే కింది పోస్టుకు మార్చి అవమానించారు. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాలరెడ్డిని నియమించుకున్నారు. ఈ హడావిడీ బదిలీ వారం రోజుల కిందటే చేశారు. ఇలా చేయడాన్ని సీనియర్‌ ఐఏఎస్‌లు కూడా తప్పుబడుతున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదు. ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయి’ అని పవన్‌ కల్యాణ్‌ ఈ అంశంపై తన వాదనను వినిపించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + ten =