ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్

Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, Yadadri Temple Latest News, Yadadri Temple Renovation Works

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఏలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచించారు. మొదట లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా వున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు

‘‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్ లైన్ పెట్టుకుని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టీ ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యతా పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా వుండాలి. ప్రతీది నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం, ఇక్కడ పూజలు చేయటం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశ విదేశాల్లో లక్ష్మి నర్సింహస్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ భక్తులకు దైవ దర్శనం విషయంలో కానీ, వసతి సౌకర్యంలో కానీ, పుణ్య స్నానాల విషయంలో కానీ, తలనీలాల సమర్పణలో కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. రాతి శిలలను అధ్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని సీఎం అభినందించారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అధ్భుత ఆకారాలతో కూడి ప్రాకారాలు సిద్ధమయ్యాయని సీఎం అన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయిందని సీఎం అన్నారు. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సీఎం సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించే విధంగా తైల వర్ణ చిత్రాలను వేయించాలని సీఎం ఆదేశించారు.

ప్రెసిడెన్షియల్ సూట్ పరిశీలన

అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ కొన్ని మార్పులను సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినప్పటికీ వారికి సౌకర్యవంతంగా వుండేట్లు ప్రెసిడెన్షియల్ సూట్ వుండాలని చెప్పారు. బస్వాపురం రిజర్వాయర్ ను పర్యటక ప్రాంతంగా మారుస్తున్న విధంగానే ప్రెసిడెన్షియల్ సూట్ కు సమీపంలో వున్న మైలార్ గూడెం చెరువును సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయ వుండే గుట్ట నుండి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు ఫైల్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిషోర్, వివేకానంద, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శంభీపూర్ రాజు, జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వైటిడిఎ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఇవో గీత, ఆలయ నిర్మాణ శిల్పి ఆనంద్ సాయి, ఆర్ అండ్ బి ఇఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =