“ఆదివారం పది గంటలకు పదినిమిషాలు” కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి- మంత్రి కేటిఆర్

Commissioners, KTR Video Conference, Minister KTR, Minister KTR Latest News, Minister KTR Video Conference, Minister KTR Video Conference With Commissioners, Minister KTR Video Conference With Municipal Chairpersons, Municipal Chairpersons, telangana, Telangana News, Telangana Political Updates

తెలంగాణ ప్రభుత్వం మరిసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు. జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో పురపాలక శాఖ అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధులు, ప్రజలంతా కూడా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 13, శనివారం నాడు మునిసిపాలిటీలపైన మునిసిపాలిటీల చైర్మన్, కమిషనర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కేటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీల నిర్వహణపైన అవసరమైన మేరకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు, ప్రణాళికల పైన మంత్రి కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రతి పట్టణ పురపాలిక బడ్జెట్లో 10 శాతం హరిత బడ్జెట్ గా ఉండాలన్న నిబంధనను నూతన పురపాలక చట్టం చెబుతుందని, ఈ మేరకు ప్రతి ఒక్కరు పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పట్టణంలో చెట్లను నాటడంతో పాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా పురపాలక శాఖ, కమిషనర్, చైర్ పర్సన్లదేనని, కనీసం 85% నాటిన చెట్లను కాపాడాలని మంత్రి కేటిఆర్ తేల్చిచెప్పారు. ఇప్పటినుంచే నాటిన చెట్లను కాపాడేందుకు అవసరమైన నీటి సరఫరా వంటి ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి పట్టణంలో నాటిన చెట్లు అన్నిటిని సంరక్షించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. డంప్ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

దీంతోపాటు పురపాలక పట్టణాల్లో సాధ్యమైనంత ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలను నాటడం ద్వారా వాటిని సంరక్షించడం సులువు అవుతుందని తెలిపారు. దోమలను తరిమే మస్కిటో రిప్పెలంట్ చెట్లను నాటాలి అన్నారు. పట్టణాల్లో ఉన్న ఖాళీస్థలాల్లో చెట్లను నాటడంతో పాటు ప్రతి పట్టణానికి ఒక ట్రీ- పార్క్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 పట్టణాలకు దగ్గర్లో అటవీ బ్లాకులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో చెట్లు నాటేందుకు పురపాలికలు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం పురపాలికలు చేసే గ్రీన్ బడ్జెట్ వినియోగం పైన భవిష్యత్తులో సమగ్రమైన సమీక్ష ఉంటుందని, హరితహారం కార్యక్రమాన్ని లేదా గ్రీన్ బడ్జెట్ ప్రాధాన్యతను తక్కువచేసి చూసేందుకు వీలు లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి పట్టణంలో స్మృతి వనాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, నిరంతరం సమీక్ష నిర్వహించాలని పురపాలక శాఖాధికారులను మంత్రి కోరారు.

గతానికి భిన్నంగా ప్రతినెల ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం నేరుగా పురపాలికలకు అందిస్తూ వస్తున్నదని, ఇప్పటిదాకా సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులను అందించామన్నారు. హైదరాబాద్ కార్పోరేషన్ తో సహా ప్రతినెల 148 కోట్ల రూపాయల నిధులను నేరుగా మున్సిపాలిటీలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ నిధులతో పారిశుద్ధ్యంతో పాటు అత్యవసరమైన ఇతర కార్యక్రమాలను మున్సిపాలిటీలు నిర్వహించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ని కూడా చేపట్టామన్నారు. ఈ సీజన్ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ద్యానికి అదనంగా నాలుగు రెట్లు ఎక్కువగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

పురపాలికలు చేపడుతున్న కార్యక్రమాల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రతి వారం పాటు పది నిమిషాల చొప్పున తమ సొంత కుటుంబాల కోసం సమయం కేటాయించుకుంటే, దోమల ద్వారా వచ్చేటువంటి అనేక సీజనల్ వ్యాధులు ఎదుర్కోవచ్చన్నారు. రేపు ప్రతి ఆధివారం లాగానే జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. వర్షాకాలం సందర్భంగా చేపట్టేటువంటి మురికి కాల్వలు, వాన నీటీ కాల్వల పూడీక తీత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రతి వర్షాకాలం నీళ్లు నిలిచిపోయే ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగిన్ పాయింట్లు, మ్యాన్ హొల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రశంసలు:

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటీ వేంకటేశ్వర రావు మరియు కమిషనర్ కి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించిన తీరుపైన పూర్తి వివరాలతో వీరు ఒక నివేదికను రూపొందించి మంత్రికి పంపించారు. ఈ సందర్భంగా వారు చేసిన ప్రయత్నానికి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్, ఇదే తీరున ప్రతి ఒక్క పట్టణం తాము చేపట్టిన కార్యక్రమాలపైన ఒక రిపోర్టును తయారు చేయాలన్నారు. ఇల్లందు మాదిరి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడానికి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను ఫోటోలతో సహా ఒక రిపోర్ట్ తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచితే ప్రజలకి తాము చేస్తున్న కార్యక్రమాలు అర్థమవుతాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 2 =