మేడారం మహా జాతర: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai Soundararajan Visits Medaram Sammakka-Saralamma Jatara Today

మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు పలువురు ప్రముఖులు హాజరై దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. ఈ పర్యటనపై గవర్నర్ ట్వీట్ చేస్తూ “వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషం గా ఉంది. “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుంది. ఈ జాతరకు మద్దతుగా నిలుస్తున్న గిరిజన మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

ముందుగా సమ్మక్క-సారలమ్మ జాతర చివరిరోజైన శనివారం నాడు మేడారం చేరుకున్న గవర్నర్ కు రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తమిళిసై తల్లులను దర్శించుకుని తల్లులకు చీర, సారెలను, గోవిందరాజు, పగిడిద్దరాజులకు పంచెలను సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సమ్మక్క-సారలమ్మ తల్లులను గవర్నర్ ప్రార్ధించారు. దర్శనానంతరం అధికారులు, పూజారులు గవర్నర్ కు చీర, పసుపు కుంకుమ, బంగారం(బెల్లం), జ్ఞాపికను అందజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా జాతర విశిష్టతను తెలియజేస్తు రూపొందించిన సావనీర్ ను గవర్నర్ ఆవిష్కరించారు.

అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి గవర్నర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడారం జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరని, ఈ జాతరకు రావడం తల్లులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను రక్షిస్తూ ప్రజలందరికీ సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను కలుగచేయాలని తల్లులను ప్రార్థించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు సీతక్క, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమాదేవి, శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర పునరుద్ధరణ కమిటీ సభ్యులు సిద్దబోయిన జగ్గారావు, అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =