తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్బుతం, సిక్కిం మంత్రి ప్రశంసలు

Sikkim Minister Lok Nath Sharma Meets Minister Talasani Srinivas, Praises Telangana Welfare Schemes

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్బుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన సిక్కిం మంత్రి శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక డైరెక్టరేట్ లో గల కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి పూర్తిస్థాయిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. జీవాల పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో వాహనం 14.65 కోట్ల రూపాయల ఖర్చుతో 100 సంచార పశువైద్య వాహనాలను ప్రారంభించి, జీవాల వద్దకే వెళ్ళి వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా జీవాలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 6 రకాల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలు పోగా మిగిలిన వ్యాక్సిన్ ను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు ఆర్ధికాభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని వివరించారు. కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో చేపట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమంతో అనతికాలంలోనే ఆశించిన ఫలితాలు లభించాయని చెప్పారు. గొర్రెల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని తెలిపారు.

2014-15 సంవత్సరంలో 17.17 గా ఉన్న జీడీపీ, 2020-21 నాటికి 32.3 శాతంకు పెరిగిందని, ఇది ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే అన్నారు. రాష్ట్రంలో 7.31 లక్షల మంది గొర్రెల పెంపకం దారులు ఉన్నారని, వీరికి రెండు విడతలుగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించి మొదటి దశలో 3,88,586 మంది సభ్యులకు 81.60 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు వివరించారు. వీటి వలన గొర్రెల సంఖ్య 1.28 కోట్ల నుండి 1.91 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 1.30 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని, వీటి విలువ సుమారు 7800 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత స్థానంలో నిలిచే పాడిరంగం అభివృద్ధి, పాడి రైతులను ప్రోత్సహించే విధంగా కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వరంగంలోని విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులకు లీటరు పాలకు 4 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా 2.93 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరుతుందని, ఇప్పటి వరకు 343 కోట్ల రూపాయలను పాడి రైతులకు చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పాలసేకరణ ప్రతిరోజు 1.27 లక్షల లీటర్ల నుండి 3.97 లక్షల లీటర్లకు పెరిగిందని వివరించారు. విజయ డెయిరీ ద్వారా పాలు, వివిధ రకాల పాల పదార్ధాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. విజయ ఉత్పత్తులను 42 ఎలెక్ట్రిక్ వెహికల్స్ (ఈ కార్ట్) ల ద్వారా, ప్రత్యేక ఔట్ లెట్ ల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు చెప్పారు. విజయ డెయిరీ టర్నోవర్ సంవత్సరానికి 700 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు.

విజయ డెయిరీ సంస్థ అభివృద్ధిలో భాగంగా మార్కెటింగ్ ను పెంచుకునేందుకు గాను ఉత్పత్తి సామర్ధ్యం కూడా పెంచే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా 246 కోట్ల రూపాయల వ్యయంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 నుండి 8 లక్షల లీటర్ల సామర్య్ధంతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో రోజుకు లక్ష లీటర్ల టెట్రా ప్యాక్ ప్లాంట్, 5 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఐస్ క్రీం ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేలుజాతి పశుసంపద ను అభివృద్ధి చేయడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం కరీంనగర్ లో ఒక పశువీర్య ఉత్పత్తి కేంద్రం, నాణ్యత పరీక్షల కోసం ఒక ల్యాబ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. కంసానిపల్లి లో మరో కేంద్రం నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు, మంచినీటి రిజర్వాయర్ లలో రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మత్స్యకారులు చేపలు విక్రయించుకోవడానికి సబ్సిడీపై వాహనాలు, చేపలు, చేపల వంటకాల విక్రయాల కోసం మొబైల్ రిటైల్ ఫిష్ ఔట్ లెట్ లను సబ్సిడీ పై అందజేసిన విషయాన్ని వివరించారు. మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ ప్రభుత్వానికి 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అగ్రిపుడ్ ఎంపవర్ మెంట్ అవార్డ్, 10 లక్షల రూపాయలను అందజేసిందని తెలిపారు.

వీటిపై స్పందించిన సిక్కిం మంత్రి లోకనాథ్ శర్మ మాట్లాడుతూ పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్బుతంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. తమ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. తప్పకుండా త్వరలోనే తమ అధికారులు సిక్కిం రాష్ట్రంలో పర్యటిస్తారని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకొన్నాను, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్ధికంగా ఎంతో అభివృద్దిని సాధిస్తుందని సిక్కిం మంత్రి ప్రశంసించారు. కృత్రిమ గర్బధారణ కార్యక్రమం వలన మేలుజాతి పశుసంపద ఉత్పత్తి జరుగుతుంది. ఇది పాడి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + ten =