దక్షిణాదికే కాదు, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు – ప్రధాని మోదీ హామీ

PM Modi Reassures Southern States on Delimitation, No Seat Loss For Any State

భారత పార్లమెంటరీ చరిత్రలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల ఆందోళనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికీ సీట్ల శాతం తగ్గదని, పైగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ గురువారం తొలుత ఈ కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్‌ షా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ కీలక నేత ప్రియాంకాగాంధీ, ఆ పార్టీ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, గౌరవ్‌ గొగోయ్‌, డీఎంకే నేత ఎ.రాజా, ఇంకా తెలుగుదేశం ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన(యూబీటీ) నేత, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తదితరులు ప్రసంగించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ..

తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం, చిన్నా, పెద్దా అనే తారతమ్యాలు ఉండరాదని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఈ సభలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారంతా భారత్ అనే ఏకైక భావన కలిగిఉండాలని స్పష్టం చేశారు. నైష్పత్తిక పద్దతిలోనే సీట్లు పెరగనున్నాయని, అందువల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు.

మహిళా ప్రపంచం క్షమించదు:

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ బిల్లు మహిళల సాధికారతకు నిదర్శనమని, దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. నిన్న బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ఓటింగ్ కోసం పట్టుబట్టిన విపక్షాలు, 104 మంది సభ్యులు గైర్హాజరు కావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలుగు రాష్ట్రాలకు రాజకీయంగా బలం చేకూరనుంది. కులగణనను తాము వ్యతిరేకించడం లేదని, జనగణనలో భాగంగా అది కూడా నిర్వహిస్తామని అమిత్ షా స్పష్టం చేయడం ద్వారా మరో వివాదానికి తెరదించారు.

నేడే ఓటింగ్

కాగా, ఈ అంశాలపై లోక్‌సభలో గురువారం 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక ఈరోజూ దీనిపై మరికొన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ప్రసంగించి తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం ఈ చారిత్రాత్మక బిల్లులపై కీలకమైన ఓటింగ్ నిర్వహించనున్నారు. నేటి (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టనున్నారు. ఓటింగ్ ఫలితాల అనంతరం మహిళా రిజర్వేషన్లు మరియు డీలిమిటేషన్ ప్రక్రియపై మరింత స్పష్టత రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here