తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ తిరస్కరించడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కేవలం 108 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. విజయ్ రెండు స్థానాలనుండి గెలిచినా నేపథ్యంలో సాంకేతికంగా ఆపార్టీకి 107 సీట్ల బలమే ఉంటుంది. దీంతో టీవీకే పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ తన 5 స్థానాలను ప్రకటించినప్పటికీ, మొత్తం సంఖ్యాబలం 112 వద్దే నిలిచిపోయింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు ఇంకా 6 స్థానాల లోటు ఉండటంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పూర్తి మెజారిటీ నిరూపించుకోకుండా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. విజయ్‌తో భేటీ అయిన సందర్భంగా, మాండేట్ స్పష్టంగా ఉండాలని, సంఖ్యాబలం నిరూపించుకోవాలని, 118 మంది ఎమ్మెల్యేల వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుక మరికొన్ని రోజులు వాయిదా పడనుంది. స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజారిటీ నిరూపణ తప్పనిసరి కావడంతో, తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
కాగా, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో సంఖ్యాబలం అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వడంతో పాటు రాజ్యాంగ నిబంధనలను పాటించడం అనివార్యం. విజయ్ తన బలాన్ని నిరూపించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.








































