వాహనదారులకు మరోసారి షాక్.. నాలుగు రోజుల్లో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel Rates Increased for the Second Time in Four Days

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు అమెరికా ఆంక్షల గడువు ముగియడం దేశీయంగా చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వాహనదారులపై చమురు భారం మరింత పెరిగింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండోసారి పెరగడం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మేరకు పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు వరకు పెంపును ప్రకటించాయి చమురు కంపెనీలు.

తాజా సవరణల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి:

  • ఢిల్లీ: లీటర్ పెట్రోల్‌ 98.64 రూపాయలకు, డీజిల్‌ 91.58 రూపాయలకు చేరింది. అంతకుముందు మే 15న కూడా ఇక్కడ పెట్రోల్, డీజిల్‌లపై ఏకంగా 3 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి.

  • కోల్‌కతా: పెట్రోల్ 96 పైసలు పెరిగి 109.70 రూపాయలు, డీజిల్ 94 పైసలు పెరిగి 96.07 రూపాయలకు చేరుకుంది.

  • చెన్నై: పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి 104.49 రూపాయలు కాగా, డీజిల్ 86 పైసలు పెరిగి 96.11 రూపాయలుగా నమోదైంది.

  • ముంబై: వాణిజ్య రాజధాని ముంబైలో కూడా పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసల చొప్పున ధరలు పెరిగాయి.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల గడువు ముగియడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా మే 17 (ఆదివారం) వరకు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ ఆంక్షల కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిచిపోతే, దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడి రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించేందుకు మరియు ధరలను నియంత్రించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రధాని ఇటీవలి విదేశీ పర్యటనల్లో భాగంగా యూఏఈ వంటి దేశాలతో వ్యూహాత్మక చమురు నిల్వలు మరియు ఎల్‌పీజీ సరఫరాపై దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here