నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గతంలో జరిగిన పొరపాట్ల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
నీట్ పరీక్షలతో పాటు దేశంలో జరిగే ఇతర ప్రముఖ ప్రవేశ పరీక్షలను పర్యవేక్షించే ఎన్‌టీఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి, దేశీయ దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) కి కీలక నోటీసులు జారీ చేసింది. గతంలో తాము సూచించిన పర్యవేక్షణ, పరీక్షల సంస్కరణల యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలు చేశారో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఎన్‌టీఏను ఆదేశించింది.
నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కావడంపై ఎన్‌టీఏకు వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. గత వైఫల్యాల నుంచి ఎన్‌టీఏ పాఠాలు నేర్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా లీకేజీ అంశాలు గతంలోనూ న్యాయస్థానం దృష్టికి వచ్చాయని, అందుకోసమే గత నవంబర్ 14న ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేసింది.
ఆ కమిటీ చేసిన ప్రతిపాదనలను, సంస్కరణలను అమలు చేసేందుకు ఎన్‌టీఏ ఎలాంటి చర్యలు చేపట్టిందో స్పష్టం చేస్తూ.. మూడు రోజుల గడువులోగా పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం గడువు విధించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది తన్వి దూబె తన వాదనలను వినిపిస్తూ, మెడికల్ ప్రవేశ పరీక్షల ప్రాధాన్యతను కోర్టుకు వివరించారు. ఈ లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని, వారి కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, వైద్య విద్యా రంగాన్ని శాసించే నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షల పారదర్శకతపై ఈ ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు తీవ్రమైన నీలినీడలను కమ్మేలా చేస్తున్నాయి. సుప్రీం కోర్టు తీసుకున్న తాజా కఠిన నిర్ణయం మరియు ఎన్‌టీఏకు విధించిన మూడు రోజుల గడువు నేపథ్యంలో.. ఈ పరీక్షల నిర్వహణ లోపాలను సరిదిద్దడానికి కేంద్ర సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలను న్యాయస్థానం ముందు ఉంచబోతోందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆసక్తికరంగా మారింది.






































