ఒక సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం కానీ.. మా సెక్రటేరియట్లో కూర్చుని రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని తేల్చి చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్నటి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దేశభక్తి, ప్రాంతీయవాదం మరియు పోరాటాల గురించి తాము పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పిన కేటీఆర్ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని.. అయితే జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేదేముందని వ్యాఖ్యానించారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేశారని గుర్తుచేస్తూ, తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని, ఆయన రాజకీయాలను ఇక్కడి ప్రజలే ఓట్ల రూపంలో అడ్డుకున్నారని చెప్పారు.
నాడు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా?
-
ఆత్మబలిదానం ప్రాంతీయవాదమా?: ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ కల్యాణ్ అంటున్నారని, మరి నాడు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ప్రాణాలర్పించి ఆత్మబలిదానం చేసుకున్నారు కదా.. దానిని కూడా ప్రాంతీయవాదం అంటారా? అని కేటీఆర్ నిలదీశారు.
-
ఆర్థిక ప్రాంతీయవాదంపై ప్రశ్నలు: తెలంగాణకు రావాల్సిన బహుళజాతి పెట్టుబడులన్నింటినీ గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని, మరి జాతీయవాదం ముసుగులో కేంద్ర పెద్దలు చేస్తున్న ఈ ‘ఆర్థిక ప్రాంతీయవాదం’ కరెక్టేనా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కు మాత్రమే పీఎంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని అడిగారు.
అప్పుడు అన్నం తినలేదన్న వ్యక్తికి ఇక్కడ సభ ఎందుకు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తీవ్ర ఆవేదనతో తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని గతంలో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారని గుర్తుచేసిన కేటీఆర్, అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే హైదరాబాద్‌కు వచ్చి ‘నవ నిర్మాణ సభ’ పేరుతో మీటింగ్ పెడతానంటే ఇక్కడి ప్రజలు ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ నేల ఎప్పటికీ ఇక్కడి భూమిపుత్రుల జాగీరేనని నొక్కిచెప్పారు.
నటుడిగా గౌరవిస్తాం.. రాజకీయ పెత్తనం సాగదు
పవన్ కల్యాణ్‌ను ఒక నటుడిగా తాము మనస్ఫూర్తిగా అభిమానిస్తామని కేటీఆర్ తెలిపారు. ఒక సోదరుడిగా ఆయన ఎప్పుడు తమ ఇంటికి వచ్చినా ఆదరంగా కూర్చోబెట్టి హైదరాబాదీ బిర్యానీ పెట్టి సత్కరిస్తామని, అంతేకానీ ఇక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి పెత్తనం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు చేసి, ఎంతో కష్టపడి మొన్ననే కదా విడిపోయామని, మళ్లీ ఇప్పుడు తెలంగాణపై ఆంధ్ర పాలకుల పెత్తనం ఎందుకంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మొత్తానికి తాజాగా కేటీఆర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు తమ పరిధిని దాటి తెలంగాణ అంతర్గత విషయాల్లో మరియు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం తగదని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్ గట్టిగా తిప్పికొడుతుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.



































