ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ సమగ్రత దృక్పథంతో ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం..’ అనే నూతన విధానంపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు (పుష్కర కాలం) పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశ సమగ్రత కోసం ఒక రాజకీయ శక్తిగా ఎలా నిలబడాలనే అంశంపై ఈ వేదిక ద్వారా స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.
ఈ ప్రత్యేక సదస్సులో పాల్గొనేందుకు ఆయనతోపాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలతో పాటు తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులు, ముఖ్య నేతలు కూడా ఈ మేధోమథనంలో భాగస్వాములు కావడం విశేషం.
ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, భిన్న భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం వంటి సిద్ధాంతాలను పాటించే పార్టీగా జనసేన ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. గత పుష్కర కాలంగా జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా సాగింది, పార్టీ ఎలాంటి భావజాలంతో పనిచేస్తుందో ఈ వేదికపై నాయకులకు పవన్ కల్యాణ్ క్షుణ్ణంగా వివరించనున్నారు.
ప్రాంతీయ ఆకాంక్షలకు విలువ ఇస్తూనే, దేశ సార్వభౌమాధికారానికి మరియు జాతీయ సమగ్రతకు మధ్య ఉండాల్సిన సమతుల్యతను కాపాడుతూ ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలనే అంశంపై వర్తమాన దేశ రాజకీయాల నేపథ్యంలో నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ భావజాలాన్ని మరింత బలంగా విస్తరించే వ్యూహం కనిపిస్తోంది. కాగా, ఈ కీలక సమావేశం ప్రారంభానికి ముందు పవన్ కల్యాణ్ జాతీయ యుద్ధస్మృతి (National War Memorial) స్థలాన్ని సందర్శించి, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు.





































