ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (IPASE), బెటర్మెంట్ పరీక్షల ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి ప్రకటించనుంది.
ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ థియరీ పరీక్షలు, జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, తుది ధృవీకరణ ప్రక్రియలను వేగంగా పూర్తి చేసిన బోర్డు ఫలితాల విడుదలకు సిద్ధమైంది. జూన్ 22 నుంచి ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత విద్య ప్రవేశ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ఫలితాలను ముందుగానే విడుదల చేస్తున్నారు.
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్సైట్లలో మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్‌తో పాటు పలు విద్యా వెబ్సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ సేవను కూడా అందుబాటులో ఉంచారు. 9552300009 నంబర్‌కు హాయ్ (Hi) మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను సులభంగా పొందే అవకాశం కల్పించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు ముందు ఫలితాలు విడుదల కావడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.




































