దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కనీసం మరో రెండు, మూడు నెలల పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఇదే తక్కువ స్థాయిలో స్థిరంగా కొనసాగితేనే దేశీయంగా ఇంధన ధరల తగ్గింపుపై పునఃసమీక్షించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి, ప్రస్తుతం భారత రిఫైనరీలు రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురునే శుద్ధి చేస్తున్నాయని ఈ సందర్భంగా వివరించారు. తగ్గిన ప్రస్తుత ముడిచమురు ధరలు మరో 2, 3 నెలలు ఇలాగే కొనసాగితే అప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని, అయితే ధరలు కచ్చితంగా తగ్గుతాయని ఇప్పుడే చెప్పడం కేవలం ఊహాజనితమే అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయలేదని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సమయంలో కూడా దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు సానుకూలంగా వ్యవహరించాయని స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు దేశీయంగా ఇంధన ధరలను పెంచకుండా నియంత్రించడం వల్ల ప్రభుత్వరంగ చమురు సంస్థలు జూన్ నెలాఖరు నాటికి రూ. 74,781 కోట్ల మేరకు నష్టపోయాయని కేంద్రమంత్రి గణాంకాలను వెల్లడించారు. ఈ అంతర్జాతీయ సంక్షోభ సమయంలో పెట్రోల్ ధరలు అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం వరకు, అలాగే భారత పొరుగు దేశాల్లో 35 శాతం వరకు పెరిగాయని గుర్తు చేశారు. అయితే భారతదేశంలో మాత్రం ప్రభుత్వ సమర్థవంతమైన చర్యల వల్ల పెట్రోల్ ధరలు కేవలం 5.58 శాతం మాత్రమే పెరిగాయని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు వ్యూహాత్మక చర్యల వల్ల అంతర్జాతీయ చమురు సంక్షోభ ప్రభావం భారతీయ వినియోగదారులపై తీవ్రంగా పడకుండా నివారించడం సాధ్యపడింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వాన్ని బట్టి చమురు సంస్థలు సాధించే లాభనష్టాలను బేరీజు వేసుకుని, దేశీయంగా ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రం ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







































