జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు సంబంధించి వరుస వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ పేపర్ లీకేజీలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల్లో భారీ సంస్కరణలకు సిద్ధమవుతోంది. ఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చే మార్కులతోపాటు ఇంటర్మీడియట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి తదితర బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ప్రవేశపరీక్షల్లో పారదర్శకత పెంచడం, విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, బోర్డు పరీక్షలకు సరైన ప్రాధాన్యత లభించేలా చూడటం లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీకవడం, పరీక్షను తిరిగి నిర్వహించడం వల్ల సుమారు 20 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విధానం, నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం 9 మందితో కూడిన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఇందులో బోర్డు పరీక్షల మార్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదు. దీనివల్ల విద్యార్థులు అకాడమిక్ చదువులను పక్కనబెట్టి కోచింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనంతటినీ సరిదిద్దే దిశగా సంస్కరణలు తెచ్చే ప్రతిపాదన ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యాంశాలు: కోచింగ్ కేంద్రాలపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించడం, పాఠశాల స్థాయిలోని సిలబస్‌కు అనుగుణంగా ప్రవేశపరీక్షలను మార్చడం మరియు క్రమంగా కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పరీక్షల విధానం వైపు మళ్లడం లక్ష్యంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ర్యాంకుల నిర్ధారణలో బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చే అంశంపై ఈ నిపుణుల కమిటీ మరికొన్ని వారాల్లో తమ తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఆ తర్వాతే ఈ సంస్కరణలపై విద్యాశాఖ నుండి అధికారిక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నూతన సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల హవాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, సాధారణ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఉన్నత విద్యావకాశాలలో సమాన అవకాశాలు దక్కే వీలుంటుంది.







































