భారత్‌కు చెందిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ కొనుగోలుకు ఇండోనేషియా అధికారికంగా అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ కీలక రక్షణ ఒప్పందం ఖరారైంది.
2018లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇరు దేశాల నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసిన భారత్.. ఇప్పుడు ఇండోనేషియాను మూడో విదేశీ కొనుగోలుదారుగా చేర్చుకుంది.
‘అస్త్ర’ క్షిపణులపై కూడా ఆసక్తి
బ్రహ్మోస్‌తో పాటు, భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘అస్త్ర’ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల కొనుగోలుపై కూడా ఇండోనేషియా ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఏర్పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సబాంగ్ పోర్ట్ అభివృద్ధికి సంయుక్త కార్యాచరణ
రక్షణ రంగంతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్ పోర్ట్ అభివృద్ధికి కూడా భారత్, ఇండోనేషియా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న ఈ నౌకాశ్రయం హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉండటంతో, ఈ ఒప్పందం ఇరు దేశాల సముద్ర భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.
పది కీలక రంగాల్లో ఒప్పందాలు
ఈ పర్యటనలో రక్షణ రంగంతో పాటు క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ఆహార భద్రత, ఔషధాల సరఫరా, పెట్టుబడులు తదితర పది కీలక రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్, స్టీల్ ఉత్పత్తి రంగాల్లో భారత పెట్టుబడులకు ఇండోనేషియా ఆమోదం తెలిపింది.
ఈవీఎం టెక్నాలజీపై సహకారం
ఇండోనేషియాలో ఎన్నికల నిర్వహణను మరింత ఆధునికీకరించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) తయారీకి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు భారత ఎన్నికల సంఘం, ఇండోనేషియా ఎన్నికల సంఘంతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా ఎన్నికల నిర్వహణలో ఇరు దేశాల మధ్య సాంకేతిక భాగస్వామ్యం మరింత విస్తరించనుంది.






































