మంత్రి నారా లోకేశ్ కొరియా పర్యటన.. సియోల్‌ వేదికగా స్టార్టప్ ఫౌండర్లతో రౌండ్ టేబుల్ సమావేశం

Minister Nara Lokesh Holds Startup Roundtable Meeting in Seoul, South Korea

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆరు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా కొరియా రాజధాని సియోల్‌కు చేరుకున్న ఆయన, అక్కడ భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. శాంసంగ్, ఎల్‌జీ, ఎస్‌కే వంటి అంతర్జాతీయ కొరియన్ ఎలక్ట్రానిక్స్ మరియు చిప్ తయారీ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేలా దౌత్యపరమైన సహకారాన్ని అందించాలని ఈ భేటీలో రాయబారికి విజ్ఞప్తి చేశారు.

సిద్ధంగా ఉన్న క్లస్టర్లు.. ఏపీ-కొరియా డెస్క్ ఏర్పాటు

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ సంస్థల కోసం శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలలో ‘రెడీ టు యూజ్’ క్లస్టర్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ వివరించారు. కొరియా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ టౌన్‌షిప్‌లను సైతం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

కియా, హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ల విస్తరణతో పాటు గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై రాయబారితో సుదీర్ఘంగా చర్చించారు. కొరియా పారిశ్రామికవేత్తలతో దౌత్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఒక ‘ఏపీ-కొరియా డెస్క్’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

భారత్‌కు ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొరియన్ స్టార్టప్ ఫౌండర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా “వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌” అనే వినూత్న నినాదంతో ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను, లక్ష ఉద్యోగాలను సృష్టించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే తమ ప్రధాన ధ్యేయమని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ క్రమంలోనే ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ తయారీ సంస్థ ‘సాఫ్ట్-ఈపీఐ’ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌తో సమావేశమై, ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

ప్రముఖ సంస్థలతో వరుస భేటీలు

మంత్రి లోకేష్ తన పర్యటనలో భాగంగా పలు ఇతర కొరియన్ పారిశ్రామిక దిగ్గజాలతోనూ వరుస సమావేశాలు జరిపారు. ‘హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్’ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యోకోటా తకేషితో భేటీ అయి, తిరుపతి లేదా శ్రీసిటీ సమీపంలో స్విచ్‌గేర్లు మరియు విద్యుత్ పరికరాల తయారీ యూనిట్‌ను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ‘సియోల్ సెమీ కండక్టర్స్’ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీని కలిసి డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 10న సియోల్‌లో జరగబోయే ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్టర్ రోడ్‌షో’ను విజయవంతం చేయాలని, తద్వారా ఏపీ పారిశ్రామిక రంగానికి సరికొత్త గ్లోబల్ ఊపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here