ఏపీకి కొత్తగా రూ.9,076 కోట్ల పెట్టుబడులు.. 11 వేల మందికి ఉద్యోగావకాశాలు – సీఎం చంద్రబాబు

CM Chandrababu Clears 11 Mega Projects Worth Rs.9,076 Cr at 19th AP SIPB Meet

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తూనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగంలోనూ అడుగుపెట్టి ఆదాయాన్ని పెంచుకునేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రూ.9,076.11 కోట్ల పెట్టుబడులతో 11 మెగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రాష్ట్రంలో 10,531 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇథనాల్, మీథేన్ రంగాలపై ప్రత్యేక దృష్టి

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాల అవసరం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇథనాల్, మీథేన్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని సీఎం సూచించారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక సమగ్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ శాతం 40కు పెరిగితే మొక్కజొన్న పంటకు భారీ డిమాండ్ ఏర్పడి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

పర్యాటక రంగానికి భారీ ప్రాధాన్యం

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంధనంగా మార్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 100 ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తిమ్మమ్మ మర్రిమాను, పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అరకు లోయ, లంబసింగిలో ప్రపంచస్థాయి రిసార్టుల నిర్మాణానికి ప్రముఖ జిందాల్ గ్రూప్ ఆసక్తి చూపుతోందని వెల్లడించారు.

పర్యాటక రంగ మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 2024లో రాష్ట్రంలో 4,390 హోటల్ గదులు ఉండగా, గత రెండేళ్లలో అదనంగా 9,364 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

స్థానిక కళలకు ప్రపంచ మార్కెట్

ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి హస్తకళలు, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ పట్టుచీరలు, పొందూరు ఖాదీ వంటి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ఈ ఉత్పత్తులను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి గ్రామీణ కళాకారులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సోలార్ తయారీలో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దాలి

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకురావాలని సూచించారు.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 38 ఎంఎస్‌ఎంఈ పార్కులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే ఈ పార్కులను రైల్వే టెర్మినల్స్‌తో అనుసంధానం చేసి రవాణా ఖర్చులను తగ్గించాలని సూచించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు వీలైనంత వరకు గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు, పెట్టుబడులే లక్ష్యం

రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం వంటి అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన కొన్ని కీలక ప్రాజెక్టులు

  • అదానీ ఫౌండేషన్: విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడితో డెవలప్‌మెంట్ ప్రాజెక్టు.

  • మోండెలీజ్ ఇండియా ఫుడ్స్: తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ. 1,801 కోట్లతో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్; 80 మందికి ఉపాధి.

  • అక్షత్ గ్రీన్‌టెక్: అనకాపల్లి జిల్లా పరవాడలో రూ. 1,600 కోట్లతో అధునాతన సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్; 750 మందికి ఉద్యోగాలు.

  • బెర్రీ అల్లాయ్స్: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో రూ. 1,200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సింటర్, డీఆర్ఐ కార్బన్ పేస్ట్ ప్లాంట్; 831 మందికి ఉద్యోగాలు.

  • ఈకో బాక్స్ ఇండస్ట్రియల్స్ (గూగుల్ వేర్‌హౌస్ పార్టనర్స్): విశాఖపట్నంలో రూ. 1,008 కోట్లతో లాజిస్టిక్స్, లైట్ ఇండస్ట్రియల్ పార్క్; 5,000 మందికి ఉపాధి.

  • జియో మైసూర్ ఇండియా: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం స్వర్ణగిరిలో రూ. 689 కోట్లతో గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల) ప్రాజెక్టు; 1,750 మందికి ఉపాధి.

  • నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్: తిరుపతి జిల్లా సత్యవేడు చిన్నఎత్తిపాకంలో రూ. 255 కోట్ల పెట్టుబడి; 400 మందికి పైగా ఉపాధి.

  • డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్: నెల్లూరు జిల్లాలో రూ. 139.92 కోట్లతో ప్రతిష్టాత్మక 4-స్టార్ హోటల్ నిర్మాణం; 180 మందికి ఉద్యోగాలు.

  • శ్రీనివాсам అమ్యూజ్‌మెంట్: కడప జిల్లాలో రూ. 68.69 కోట్లతో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్మాణం; 690 మందికి ఉద్యోగాలు.

  • వజ్ర హాస్పిటాలిటీ: విజయవాడలో రూ. 62.40 కోట్లతో హోటల్, బ్యాంకెట్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మాణం; 450 మందికి ఉపాధి.

  • మాధవి లీజర్ & స్టేస్: కడప జిల్లాలో రూ. 52.10 కోట్లతో 3-స్టార్ హోటల్ ప్రాజెక్టు; 400 మందికి ఉద్యోగ అవకాశాలు.

ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల లక్ష్మీ దుర్గేష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here