నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు – కవిత

Telangana Rakshana Sena Chief K. Kavitha Reaffirms She Will Never Rejoin BRS

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత. ఆమె నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించి సింగరేణి కార్మికుల సమస్యలపై నేరుగా ఉద్యమ శంఖం పూరించారు. సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా కార్మికులతో మమేకమైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ పార్టీ నిధుల వ్యవహారంపై అత్యంత సంచలన డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

బీఆర్‌ఎస్ నిధులపై విచారణ జరపాలి

బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల భారీ నిధులు పూర్తిగా క్విడ్ ప్రోకో (అక్రమ లబ్ధి) ద్వారా సమకూరినవేనని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిధులపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

అక్రమంగా ఆర్జించిన ఆ రూ.1,400 కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారుల కుటుంబాలకు సమానంగా పంచిపెట్టాలని స్పష్టం చేశారు.

హరీశ్ రావు లాంటి బీఆర్‌ఎస్ నేతలు ప్రస్తుతం ఇస్తున్న వివరణలన్నీ కేవలం నాటకాలని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె ఘంటాపథంగా తేల్చిచెప్పారు.

సింగరేణిలో తీవ్ర ఆర్థిక సంక్షోభం

ప్రభుత్వ తప్పుడు విధానాలు, చెల్లించాల్సిన బకాయిల ఆలస్యం కారణంగా సింగరేణి సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పనిముట్లు కూడా కొనలేని దుస్థితికి సంస్థ దిగజారిందని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం అధికారులకు ఒక రూల్, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్మికులకు మరో రూల్ వర్తింపజేస్తూ వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాకముందు సింగరేణిలో 62 వేలుగా ఉన్న రెగ్యులర్ కార్మికుల సంఖ్య.. ప్రస్తుత పాలకుల నిర్వాకం వల్ల 38 వేలకు పడిపోవడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ హక్కుగా రావాల్సిన బొగ్గు బ్లాక్‌లు సైతం ప్రైవేట్‌పరం అవుతున్నాయని విమర్శించారు.

ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష

సింగరేణిలోని పర్మినెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా కార్మికుల డిపెండెంట్ (వారసత్వ) ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడానికి నెలలో రెండు సార్లు తప్పనిసరిగా మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు.

వారసత్వ ఉద్యోగాల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని, లేనిపక్షంలో కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 20వ తేదీ నుంచి రామగుండం వేదికగా తాను నిరవధిక దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here