హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించింది. దీనిలో భాగంగా ఒక అద్భుతమైన ప్రణాళికను ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నగరంలో 1.34 కోట్ల మంది వరకు నివసిస్తున్నారని, ఇప్పటికే ఎక్కువ కాలుష్యం ఉందని, అందుకే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన, ఇందుకోసం నగరంలోని పరిశ్రమలన్నిటినీ ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
నేడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ రంగంలో ప్రసిద్ధ ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం కలిసిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రిమియర్ ఎనర్జీ రూపొందించిన మొట్టమొదటి సోలార్ ఆక్సీ ట్రీ – సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ని, యూనిట్లో సోలార్ మాడ్యూల్స్‌కు సంబంధించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టభద్రులవుతున్న నేపథ్యంలో వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగానే చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
- ఆ నగరాల అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని జీడిమెట్ల, బాలానగర్ లాంటి ఇండస్ట్రియల్ పార్కులున్న ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, దానికితోడు మూసీ నది కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- అందుకే 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ కోర్ అర్బన్ రీజియన్ లో పూర్తిగా కాలుష్యరహిత ప్రాంతంగా మార్చాలని సంకల్పించాం. పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి చట్టం చేశాం. ఓఆర్ఆర్ బయట పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ జోన్ గా గుర్తించాం. ఇక్కడి నుంచి తరలించిన పరిశ్రమలకు అవసరమైన స్థలాలను మాన్యుఫాక్చరింగ్ జోన్ లో కేటాయిస్తాం..” అని వివరించారు.
- మాన్యూఫాక్చరింగ్ జోన్లో మొట్టమొదటగా ప్రారంభమైన సంస్థ ప్రీమియర్ ఎనర్జీ కావడం ప్రశంసనీయం. కేవలం 12 నెలల కాలంలో యూనిట్‌ను నెలకొల్పిందిని సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.
- తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే మూడు ప్రాంతీయ మండళ్లుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నది మా సంకల్పం.
- వైట్ కాలర్ ఉద్యోగాలు కష్టమైన పరిస్థితులను అర్థం చేసుకుని యువత బ్లూకాలర్ జాబ్స్ అందిపుచ్చుకునే దిశగా నైపుణ్యతను పెంచడానికి ఎక్కువ దృష్టి సారించాం. ఏటీసీలు, పాలిటెక్నక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి మొత్తంగా వ్యవస్థలను ఆ దిశగా సిద్ధం చేస్తున్నాం” అని చెప్పారు.
- హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు, పరిశ్రమలు సరిపోవు. మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. 2047 నాటికి వంద సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మొదలయ్యాం. ఎక్కడికి చేరుకోవాలనుకున్నామో ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలి.
- పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించడానికి సోలార్ ఎనర్జీతో ఆక్సిజన్ పంపింగ్ చేసే యంత్రాలను ప్రీమియర్ ఎనర్జీ రూపొందించడం అభినందనీయం. అలాంటి పరిస్థితులు తలెత్తడంపై అందరూ ఆలోచన చేయాలి. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.






































