మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

Former BRS MLA Peddi Sudarshan Reddy Passes Away, BRS Chief KCR Mourns

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. జులై 31వ తేదీ అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జులై 26న హనుమకొండలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను మొదట స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం), తీవ్ర గుండెపోటుతో పాటు నాడీవ్యవస్థ స్పందించకపోవడంతో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మృతి బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 2001లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత కొత్త మలుపు తిరిగింది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.

కేసీఆర్ భావోద్వేగ నివాళి

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీతో కలిసి నడిచిన ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలను లెక్కచేయకుండా నర్సంపేటలో గులాబీ జెండా ఎగురవేసిన ధైర్యవంతుడిగా ఆయనను కొనియాడారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

అలాగే బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ సహచరులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల సానుభూతి తెలియజేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచి నివాళులర్పించిన అనంతరం, నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అకాల మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకోగా, తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన నాయకుడిగా ఆయనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here