ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలిపేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రతి సంస్థకు తమ ప్రభుత్వం పూర్తి రక్షణ, మద్దతు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCR HRD) సంస్థలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నార్తర్న్ రీజియన్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలు తెలంగాణను తమ సొంత ప్రాంతంగా భావించి నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రపంచంలోనే అత్యుత్తమ ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీలను తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కేవలం 700 ఎకరాల్లో విస్తరించి ఉంటే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని ఏకంగా 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుతున్నట్లు వెల్లడించారు.
జాతీయ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా ప్రపంచ వ్యాపార రంగానికి తెలంగాణ ప్రధాన వేదికగా మారుతోందని, తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, టోక్యో, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలతో అని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు ఆర్థిక మండలాలుగా విభజించి సమగ్ర అభివృద్ధి చేపడుతున్నామని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల సర్వీస్ రంగానికి ప్రాధాన్యమిస్తూ క్యూర్ జోన్‌గా, ORR మరియు ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య భారీ ఉత్పత్తి రంగానికి స్థానమిస్తూ ప్యూర్ జోన్‌గా, వెలుపల వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగానికి చోటిస్తూ రేర్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు కేంద్ర అనుమతులు లభించాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరు మార్గాల్లో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన వసతుల కల్పనలో ప్రభుత్వ సీఎస్ నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రతి రెండు నెలలకోసారి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రతి మూడు నెలలకోసారి తానే స్వయంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం ఆశ్వాసమిచ్చారు. అమెజాన్ రూ.లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలంగాణలో కొనసాగుతున్న స్థిరమైన పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వం ఇస్తున్న వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతుల విస్తరణ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. నాణ్యమైన మానవ వనరులు, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చొరవలతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడి రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






































