కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య, మహిళా రిజర్వేషన్, కులగణన, వందేమాతరం, విద్యార్థుల సమస్యలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సహా మొత్తం 88 మంది ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు.
543 లోక్‌సభ స్థానాలనే కొనసాగించాలి
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను మరో 25 ఏళ్ల పాటు స్తంభింపజేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదే సంఖ్యలోని స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరింది.
2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసింది.
కులగణనపై కేంద్రంపై విమర్శలు
కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. జనగణనతో పాటు కులగణనను నిర్వహించి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది.
తెలంగాణలో నిర్వహించిన కులగణనను సీడబ్ల్యూసీ ప్రశంసించింది. దేశానికి తెలంగాణ కులగణన ఒక నమూనాగా నిలిచిందని పేర్కొంది. బిహార్‌లో జరిగిన కులగణన తరహాలో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ కోరింది.
వందేమాతరం విషయంలో 1937 తీర్మానానికే కట్టుబడి ఉంటాం
కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. 1937 అక్టోబర్ 28న అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగిస్తామని పార్టీ నేతలు తెలిపారు.
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు పాల్గొన్న అప్పటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.
వందేమాతరం తమకు భావోద్వేగ అంశమని, అయితే బీజేపీ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
పేపర్ లీక్‌లపై దేశవ్యాప్త ఉద్యమం
దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల సమస్యలపై ‘ఛాత్రోంకి ఘూంజ్’ పేరుతో దేశంలోని 800 నగరాల్లో సభలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.
ఈ కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. విద్యారంగం, పరీక్షల నిర్వహణలో అవసరమైన సంస్కరణలపై నివేదిక రూపొందించి నెల రోజుల్లోగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు అందించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించినట్లు వెల్లడించారు.
దేశంలో పేపర్ లీకేజీలు తీవ్రమైన సమస్యగా మారాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. విద్యార్థుల ఆందోళనలను అణచివేసే చర్యలను కూడా కాంగ్రెస్ తప్పుబట్టింది.
అయోధ్య విరాళాల వ్యవహారంపై ఉద్యమం
అయోధ్య రామమందిరానికి సంబంధించిన విరాళాల వ్యవహారంపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ అంశాన్ని గ్రామాలు, పంచాయతీ స్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్రాల పీసీసీలకు సూచించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అక్టోబర్ నాటికి పార్టీ బలోపేతం
దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నేతలు తెలిపారు.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ
సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఆయన నివేదిక ఇచ్చారు.
రాష్ట్రంలో 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించామని, అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై రఘువీరారెడ్డి కూడా సమావేశంలో నివేదిక సమర్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.







































