తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక సంక్షేమ పథకంలో భాగంగా నిర్వహించిన ఓ టెండర్ దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసికందులకు అందించే 1 గ్రాము బంగారు ఉంగరం తయారీకి మజూరీగా కేవలం 1 పైసా మాత్రమే కోట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాయ్ మామన్ తంగ మోతిరం పథకం
తమిళనాడులోని ‘తాయ్ మామన్ తంగ మోతిరం’ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు 22 క్యారెట్లతో తయారు చేసిన 1 గ్రాము బంగారు ఉంగరాన్ని ప్రభుత్వం బహుమతిగా అందిస్తోంది. ఈ పథకం అమలు కోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ టెండర్లను నిర్వహించింది.
ఈ టెండర్లో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ పాల్గొని.. తయారీ ఖర్చు (మజూరీ), తరుగు, ప్యాకింగ్, రవాణా, బీఐఎస్ హాల్మార్కింగ్ తదితర అంశాలకు సంబంధించి ఒక్కో ఉంగరానికి కేవలం 1 పైసా మజూరీగా బిడ్ వేసింది.
మరో సంస్థ కూడా 1 పైసాకే..
మరో ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇదే 1 పైసా ధరకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. టెండర్ నిబంధనల ప్రకారం రెండు సంస్థలకు ఆర్డర్లను 70:30 నిష్పత్తిలో కేటాయించారు.
సాధారణంగా ఒక గ్రాము బంగారు ఆభరణాన్ని తయారు చేసేందుకు మజూరీగా రూ.1,000కు పైగానే వసూలు చేసే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకానికి మద్దతుగా ప్రముఖ ఆభరణాల సంస్థలు దాదాపు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ టెండర్ ద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గడంతో పాటు, పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలకు నాణ్యమైన బంగారు ఉంగరాలను అందించే అవకాశం ఏర్పడింది.






































