ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, వీలైనంత ఎక్కువ సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, తాజా పురోగతిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆధునిక టెక్నాలజీతో సేవలకు వేగం
ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు కృత్రిమ మేధ (AI), డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చైన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు అవసరమైన సేవలను తక్కువ సమయంలో అందించేలా ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టం చేశారు.
‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం అందుతున్న 1,204 సేవలకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియను మరింత సరళీకరించాలని ఆదేశించారు. ఒకసారి సమర్పించిన ధ్రువపత్రాలను ఇతర ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మళ్లీ మళ్లీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా శాఖల మధ్య డేటా అనుసంధానాన్ని పూర్తి చేయాలని సూచించారు.
రైతులకు క్రాప్ అలర్ట్స్
సమీక్షలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల పనితీరుపైనా సీఎం చర్చించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన నీటిని సమృద్ధిగా అందించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంకా సాగు ప్రారంభం కాని ప్రాంతాల్లో రైతులను వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
పంటల పరిస్థితులు, వాతావరణ మార్పులు, అవసరమైన సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు RTGS ద్వారా క్రాప్ అలర్ట్స్ పంపాలని చంద్రబాబు పేర్కొన్నారు.
కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాగునీటి అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
తాగునీరు, సీజనల్ వ్యాధులపై సమీక్ష
వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో డెంగీ సహా సీజనల్ వ్యాధుల పరిస్థితిపై కూడా సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు అదుపులోనే ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.







































