భారతీయ ఐటీ నిపుణులకు షాక్.. H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన ప్రతిపాదన

Trump Administration Proposes 103,265 Dollars Fee for New H-1B Visas

అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలకు 1,03,265 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.86 లక్షల మేర ఫీజు విధించే ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ముందుకు తెచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

30 రోజులు ప్రజల అభిప్రాయాల స్వీకరణ

కొత్త ఫీజు ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజలు, సంబంధిత సంస్థల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, గత ఏడాది ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాలపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో ప్రస్తుతం దీనిపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.

భారతీయ నిపుణులపై భారీ ప్రభావం?

అమెరికాలో టెక్నాలజీ, ఇంజినీరింగ్, విద్య, పరిశోధన వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను నియమించుకునేందుకు కంపెనీలు H-1B వీసా విధానాన్ని ఉపయోగిస్తున్నాయి.

ప్రతి ఏడాది సాధారణ కేటగిరీలో 65 వేల H-1B వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు అదనంగా 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H-1B వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. చైనా నిపుణులు సుమారు 12 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

దీంతో కొత్త ఫీజు ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ నిపుణులపై దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అందరికీ కొత్త ఫీజు వర్తించదు

అయితే ఇప్పటికే ఉన్న H-1B వీసాల పునరుద్ధరణకు ఈ భారీ ఫీజు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అమెరికాలో విద్యార్థి వీసాపై ఉన్న విదేశీయులు H-1B వీసాకు మారే సందర్భాల్లోనూ ప్రతిపాదిత ఫీజు వర్తించదని పేర్కొంది.

H-1Bపై ట్రంప్ ప్రభుత్వం వాదన ఇదే

H-1B కార్యక్రమాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికా పౌరుల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కొన్ని కంపెనీలు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

భారీ ఫీజు విధించడం ద్వారా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం కంటే అమెరికన్ కార్మికులను నియమించుకునే దిశగా ప్రోత్సహించబడతాయని ప్రభుత్వం వాదిస్తోంది.

అయితే వ్యాపార, పరిశ్రమ వర్గాలు ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను అధిగమించడంలో H-1B కార్యక్రమం కీలకంగా ఉందని, భారీ ఫీజులు విధించడం వల్ల కంపెనీలపై అదనపు భారం పడుతుందని అవి చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here