తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై శాసనసభలో స్పీకర్‌తో పాటు అధికారపక్ష మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంతసేపు వాడివేడి వాతావరణం నెలకొంది.
స్పీకర్ అంటే గౌరవం ఉంది: హరీశ్ రావు
ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో వివరణ ఇచ్చారు. స్పీకర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, స్పీకర్ చైర్‌ను కూడా గౌరవిస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా కూడా గడ్డం ప్రసాద్ కుమార్ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయనతో చాలా సంవత్సరాలుగా సభలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు.
తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారని హరీశ్ రావు తెలిపారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తమ సభ్యుడు మీడియా సమక్షంలోనే చెప్పారని పేర్కొన్నారు. సభ్యుడు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఈ అంశంపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారని, ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారని ప్రశ్నించారు.
సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయి: మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను పక్కన పెట్టాలని ఎలా అంటారని ప్రశ్నించారు. ‘‘మీరు చెప్పిందే నడవాలా? ఏం పద్ధతి ఇది?’’ అంటూ మండిపడ్డారు. నిన్న జరిగిన ఘటనతో సభలోని సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. స్పీకర్ స్థానంలో దళితుడు కూర్చోవడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాట తప్పారని, ద్రోహం చేశారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అంబేద్కర్ వర్ధంతికి కేసీఆర్ ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. గతంలో సంపత్ కుమార్ ఏం తప్పు చేశారని ఎక్స్పెల్ చేశారని నిలదీశారు. మహిళలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా స్పీకర్‌కు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.
22ఏ భూములపై చర్చకు డిమాండ్
అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 22ఏ నిషేధిత భూముల జాబితా అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ అంశంపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల అంశంపై ఎప్పుడు చర్చ చేపడతారో స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ అంశంపై చర్చను కొనసాగించాలని కోరిన అనంతరం సభలో పరిస్థితులు కొంత సద్దుమణిగాయి. అనంతరం తెలంగాణ శాసనసభను కాసేపు వాయిదా వేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం, బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు మరోసారి రాజకీయంగా వేడెక్కాయి.










































