ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు

Brace for bus fare, CM KCR Orders Officials to Submit TSRTC, CM KCR Plans to Hike RTC and Power Charges, Electricity Charges Hike Proposals to Cabinet, Hyderabad, Mango News, power charges hike, Power tariff hike, Telangana cabinet to clear increase in power tariff and RTC Charges, Telangana CM K Chandrasekhar Rao, TSRTC and power charges likely to increase, TSRTC and power charges likely to increase in Telangana

ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా–లాక్ డౌన్ తో పాటు కేంద్రం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎంకు విన్నవించుకున్నారు.

ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి:

గత సంవత్సరంన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ.22 రూపాయలు పెరగడం మూలాన ఆర్టీసీపై రూ.550 కోట్లు అధనపు ఆర్థిక భారం పడుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. డీజిల్ తో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. వీటన్నిటి ద్వారా మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని తెలిపారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు వాపోయారు. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎంకు మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు.

చార్జీల పెంపుపై ప్రతిపాదనలతో రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలి :

గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు సీఎంకు తెలిపారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదని, ఇంకా కూడా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావం నుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు. నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి వున్నదని వారు తెలిపారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని, అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

ఆర్టీసీతో పాటు విద్యుత్ చార్జీలపై రాబోయే కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం:

ఇదే సందర్భంలో రాష్ట్రంలో విద్యుత్ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకార్ రావు సీఎంతో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్ సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వారు సీఎంకు వివరించారు. గత ఆరేండ్లుగా విద్యుత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలు పెంచాలని వారు సీఎంకు విన్నవించుకున్నారు.
కాగా అటు ఆర్టీసీతో పాటు విద్యుత్ అంశాలకు సంబంధించి రాబోయే కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, విద్యుత్ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు, జెన్ కో అండ్ ట్రాన్స్ కో సిఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here