దుర్గగుడి బోర్డులో చోటు.. సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన సుస్మిత కొణిదెల

Sushmita Konidela Thanks CM Chandrababu After Joining Kanaka Durga Temple Trust Board

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చోటు లభించింది. ఆమెను ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం (సెప్టెంబర్ 8) ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత

తనకు లభించిన ఈ బాధ్యతపై సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనను దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ దైవిక బాధ్యతను వినమ్రతతో స్వీకరిస్తున్నానని సుస్మిత పేర్కొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారికి సేవ చేయడంతో పాటు ఆలయ కార్యకలాపాల్లో తన వంతు కృషి చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

సుస్మితకు బండ్ల గణేష్ అభినందనలు

సుస్మిత కొణిదెలకు దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం లభించడంపై ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్, సుస్మిత కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో సుస్మిత మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తన సేవలతో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆమెపై ఉండాలని కోరుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు.

మెగా అభిమానుల్లో హర్షం

దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న సుస్మిత కొణిదెల.. ఆలయ సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమెకు లభించిన ఈ కొత్త బాధ్యతపై మెగా అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here