డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల వరకు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించింది. అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే చెల్లింపులపైనా చార్జీలు విధించడాన్ని నిషేధించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లోని సెక్షన్ 10ఏ కింద కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. నిర్దేశిత డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా నగదు చెల్లించే లేదా స్వీకరించే వ్యక్తి నుంచి బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. దీంతో రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులు, రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు అదనపు ఛార్జీల భారం ఉండదు.
అయితే రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లో ఉన్న సందర్భాల్లో వ్యాపారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. ఈ రుసుమును సాధారణంగా వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి వసూలు చేసే విధానం ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే పర్సన్-టు-పర్సన్ (P2P) యూపీఐ చెల్లింపులకు మాత్రం చార్జీలు ఉండవని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది.
దేశంలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ మొత్తాల్లో జరిగే వ్యాపార లావాదేవీలపై రుసుముల విధానం అమల్లోకి వస్తే బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలకు అదనపు ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా యూపీఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా నిలిచింది. 2025లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది.
గత నెలలో యూపీఐ ద్వారా 24.51 బిలియన్ లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటి మొత్తం విలువ రూ.29.82 ట్రిలియన్లుగా ఉంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 75 శాతం వాటాను గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే నిర్వహిస్తున్నాయి.
ఇక పెద్ద మొత్తాల్లో జరిగే వ్యాపార చెల్లింపులపై రుసుములు విధించే అవకాశం ఏర్పడితే.. అది బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ సంస్థలకు కొత్త ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి చార్జీల ద్వారా డిజిటల్ పేమెంట్ పరిశ్రమకు ఏడాదికి సుమారు రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరవచ్చని జెఫరీస్ గత నెలలో అంచనా వేసింది.








































