ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మత్స్యకారుల షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా తమ వేట సామగ్రిని, వలలను సురక్షితంగా షెడ్లలో భద్రపరుచుకోగా, అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ దుర్ఘటనలో సుమారు 250 నుంచి 300 వరకు విలువైన వలలు పూర్తిగా కాలిబూడిదయ్యాయని ఆయన డిప్యూటీ సీఎంకు నివేదించారు.
ఈ అగ్నిప్రమాద ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అసలు కారణాలను నిగ్గుతేల్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే తుపాను హెచ్చరికల కారణంగా సముద్రంలో వేట విరామం ఉండటంతో మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు జీవనోపాధికి ఆధారమైన వలలు పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత మత్స్యకార కుటుంబాలకు తక్షణమే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులు అందజేసి వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వలలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు తగిన ఆర్థిక నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.0’ (PMMSY 2.0) కింద బాధిత మత్స్యకారులకు నష్టపోయిన వలలను తిరిగి సమకూర్చే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.
విపత్కర పరిస్థితుల్లో ఉన్న మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ఎవరూ అధైర్యపడవద్దని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కె. పల్లెపాలెంలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
అగ్నిప్రమాదంలో నష్టపోయిన వలల విలువను అంచనా వేస్తూ బాధిత మత్స్యకారుల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తుపాను ప్రభావం ముగిసి మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లే సమయానికి వారికి అవసరమైన సామగ్రి అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





































