దేశీయ కార్పొరేట్ కంపెనీల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీల ఫలాలను కంపెనీలే అనుభవిస్తున్నాయని, కానీ ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాలు కల్పించడం గానీ, ఉద్యోగుల జీతాలు పెంచడం గానీ చేయడం లేదని మండిపడ్డారు. గురువారం (నవంబర్ 19) ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత పరిశ్రమలు, వాణిజ్య సంఘాల సమాఖ్య (FICCI) శతాబ్ది వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించామని, జీఎస్టీ రేట్లు తగ్గించడంతో పాటు రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని ప్రధాని గుర్తుచేశారు. “మీరు చప్పట్లు కొట్టరని నాకు బాగా తెలుసు.. ఎందుకంటే మీ ఆకలి అంతటిది, ఎంత తినిపించినా కడుపు నిండదు. వృద్ధి బాధ్యత అంతా ప్రభుత్వమే మోయాలని ఆశించవద్దు, ఉద్యోగుల కోసం కంపెనీలు మరింత చేయాల్సిందే” అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సూటిగా వ్యాఖ్యానించారు.
భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలను ఏది తయారు చేసినా కొనే మార్కెట్‌గా తేలిగ్గా తీసుకోవద్దని ప్రధాని మోదీ కంపెనీలను హెచ్చరించారు. ‘ఎగుమతి నాణ్యత’ పేరుతో ప్రత్యేక శ్రేణి వస్తువులను దేశీయ మార్కెట్లో అమ్మడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీ వినియోగదారులకు ఇచ్చే నాణ్యత మన దేశ ప్రజలకు అక్కర్లేదా అని ప్రశ్నించిన ప్రధాని, తన దేశ ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన వస్తువులు దక్కాలని తేల్చిచెప్పారు.
అలాగే భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అందిపుచ్చుకోవడానికి ఫిక్కీ సభ్యులు ఎప్పుడైనా ప్రణాళికలు వేశారా, లేక అది కూడా తానే వచ్చి చెప్పాలా అంటూ చురకలు అంటించారు. తమది పరిశ్రమలకు స్నేహపూర్వక ప్రభుత్వమని, వచ్చే 20 ఏళ్ల పెట్టుబడి నిర్ణయాలకు ‘ఇండియా ఫస్ట్’ పునాది కావాలని సూచించారు.
మరోవైపు, ఢిల్లీలోని భారత్ మండపంలోనే కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక భేటీలో ప్రధాని మోదీ ఆర్థిక క్రమశిక్షణ మరియు సామాజిక అంశాలపై కీలక దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించాలని, తినడం, తాగడం, జల్సాలు చేయడం అనే ధోరణి భారతీయ సంస్కృతి కాదని ఆయన స్పష్టం చేశారు.
2011 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించిన ప్రధాని, ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే ఆ ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రస్తావించిన ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశ భవిష్యత్తు అయిన యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశంలో నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న విధంగానే, ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తే మాదకద్రవ్యాల మహమ్మారిని కూడా పూర్తిగా అధిగమించగలమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.







































