తెలంగాణలో 22A నిషేధిత భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్లో నమోదైన అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ.. 22A జాబితాలో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు.
విపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు నేడు తెలంగాణ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ డేటా ఆధారంగా వాస్తవాలను సభ ముందుకు తీసుకొచ్చారు.
నిషేధిత భూముల వాస్తవ గణాంకాలు
రాష్ట్రంలో భూ భారతి పోర్టల్ ద్వారా 2.5 కోట్లకు పైగా ఎకరాల వివరాలను నమోదు చేయగా, అందులో 1.01 కోటి ఎకరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రయవిక్రయాలకు వీలులేని విభాగాల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో 46 లక్షల ఎకరాల అటవీ భూములు, 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 17 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మరియు 12 లక్షల ఎకరాల నీటి వనరులు, ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ సహజంగానే 22A జాబితా కిందకు వస్తాయని, వీటిని శాశ్వతంగా రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రైవేట్ భూముల విషయంలో కీలక హామీ
ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదంగా ఉన్న భూమి మాత్రం సుమారు 3.05 లక్షల ఎకరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. 22A జాబితాలో ఉన్న మొత్తం భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
22A జాబితాలో తమ భూమి చేరిందని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వారి నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారని సీఎం చెప్పారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
అర్హులైన భూ యజమానులకు నష్టం జరగదని హామీ
నిజమైన ప్రైవేట్ భూ యజమానులకు ఒక్క ఇంచు భూమి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హత ఉన్న భూములపై వచ్చే ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని, ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
భూ రికార్డుల్లో ఉన్న వివరాలను ఆధారంగా చేసుకుని 22A భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, నీటి వనరుల భూములను పరిరక్షించడంతో పాటు.. చట్టబద్ధమైన ప్రైవేట్ భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.






































