ప్యారడైజ్ సినిమా మొత్తం ఒకెత్తు.. కేసీఆర్ ఉన్న ఆ నాలుగు నిముషాలు ఒకెత్తు – మాజీ మంత్రి కేటీఆర్

BRS Working President KTR Special Review on The Paradise Movie

మూడు గంటల ‘ది ప్యారడైజ్’ సినిమా ఒకెత్తు.. కేసీఆర్ ఉన్న ఆ నాలుగు నిముషాలు ఒకెత్తు అని పేర్కొన్నారు మాజీ మంత్రి,  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఆయన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ది ప్యారడైజ్’ను హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో వీక్షించారు. అనంతరం సినిమా గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే, ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను తెలియజేశారు. ఈ చిత్రంపై ఆయన ఇచ్చిన రివ్యూతో పాటు, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పోలిన పాత్రపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణ అస్తిత్వ పోరాటం – చిత్రబృందానికి ప్రశంసలు

సినిమా చూసిన అనంతరం కేటీఆర్ స్పందిస్తూ.. “అస్తిత్వం కోసం ఆరాటం, అణచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారతాయి అనే గొప్ప సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకి హృదయపూర్వక అభినందనలు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు” అని కొనియాడారు. తెలంగాణ నేల, భాష మరియు సాంస్కృతిక విశిష్టతను ఈ చిత్రం ఎంతో ప్రతిభావంతంగా తెరపైకి తీసుకొచ్చిందని తెలిపారు.

కేసీఆర్ శైలిలోని ‘శంకర్’ పాత్రపై ప్రత్యేక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్’ (శంకరన్న) పాత్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తుచేసేలా రూపొందించబడింది. ఈ పాత్ర ప్రదర్శనపై కేటీఆర్ స్పందిస్తూ నటుడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

“చావు నోట్లో తలపెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా. You know who that is ✊ (ఈ మాట చెప్పింది ఎవరో మీకు తెలుసు)” అంటూ కేసీఆర్ స్వయంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అన్న చారిత్రాత్మక వ్యాఖ్యలను గుర్తుచేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడి పాత్రను ప్రతిబింబించేలా ఉన్న ఈ సన్నివేశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here