ఏపీ స్థానిక ఎన్నికలు: మేయర్ అభ్యర్థుల నామినేషన్ డిపాజిట్ ఖరారు, ఎంతంటే..?

AP Local Elections SEC Announces Rs.3K Nomination Deposit For Mayoral Candidate

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అభ్యర్థులు చెల్లించాల్సిన నామినేషన్ డిపాజిట్లు (ధరావతు) మరియు ఎన్నికల వ్యయ పరిమితులను అధికారికంగా ప్రకటించింది. అమరావతిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఈసీ ఈ మార్గదర్శకాలను వెల్లడించింది. నగరపాలక సంస్థల్లో మేయర్ స్థానానికి, అలాగే మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

తాజా ప్రకటన ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.3,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,500 ధరావతు చెల్లించాలని ఎస్ఈసీ పేర్కొంది. మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఇదే డిపాజిట్ విధానం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల వ్యయాలపై కూడా ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. విశాఖపట్నం మేయర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చును గరిష్టంగా రూ.40 లక్షలుగా, కార్పొరేటర్ అభ్యర్థికి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. మిగిలిన కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులకు రూ.25 లక్షలు, కార్పొరేటర్లకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థులు రూ.20 లక్షలు, కౌన్సిలర్లు రూ.7.5 లక్షల వరకు వ్యయం చేయవచ్చని తెలిపారు.

అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని ఎస్ఈసీ ఆదేశించింది. బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అధికారులు సింగిల్ విండో పద్ధతి ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి ఉంటుందని, పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాలని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here