ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా చెప్పినట్టుగానే మరో డీఎస్సీని అనౌన్స్ చేసింది. ఈ మేరకు తాజాగా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ప్రకటన ద్వారా సాధారణ పాఠశాలల్లో 2,111 ఖాళీలను, ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) కింద 350 పోస్టులను, అలాగే సంక్షేమ గురుకులాలు మరియు ఇతర యాజమాన్యాల్లో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 3వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలోపే పాఠశాల విద్యాశాఖ పూర్తి స్థాయి నోటిఫికేషన్తో పాటు జిల్లాలు, రోస్టర్, రిజర్వేషన్లు మరియు అర్హతల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 404 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 291, వైఎస్సార్ కడప జిల్లాలో 227 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అత్యల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 15, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులను మల్టీ జోనల్ ప్రాతిపదికన, పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్ పరిధిలో భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే ఒక డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు తాజా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2,700కి పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనుండటంతో ఏపీలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










































