ట్యాంక్‌బండ్‌పై సంబురాలు.. బతుకమ్మ ఆడిన సినీనటులు రష్మిక, విజయ్‌

Vijay Deverakonda and Rashmika Mandanna Participated in Saddula Bathukamma Celebrations at Tank Bund

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుద్దీపాల అలంకరణలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, సుమారు 700 మంది కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్‌పై లేజర్‌ షో, బాణసంచా ప్రదర్శన వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.

ప్రముఖుల హాజరు.. బతుకమ్మ ఆడిన రష్మిక

ఈ వేడుకలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకీ శుక్లా, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు హాజరయ్యారు. గవర్నర్ సతీమణి జానకీ శుక్లా, మంత్రి సీతక్క, రష్మిక కలిసి బతుకమ్మ ఆడారు.

తెలంగాణ కోడలిగా గర్వంగా ఉంది: రష్మిక

తెలంగాణ పండుగల్లో బతుకమ్మ, బోనాలంటే తనకు ఎంతో ఇష్టమని విజయ్ దేవరకొండ తెలిపారు. పెళ్లి తర్వాత తెలంగాణలో జరిగే పెద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని రష్మికకు ముందే చెప్పానని వెల్లడించారు. తాను తెలంగాణ కోడలినని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల్లో భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని రష్మిక అన్నారు. గతంలో తనను ‘మేడం’ అని పిలిచేవారని, ఇప్పుడు ‘వదినా’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారని చెబుతూ, ఈ అభిమానం ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణపై సందేశం

బతుకమ్మ ఐకమత్యానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. చెరువులు, పంట పొలాలను పరిరక్షించుకోవాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మరోవైపు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని గవర్నర్ ప్రజలకు సూచించారు. హనుమకొండలోని పద్మాక్షి ఆలయం వద్ద కూడా వేలాది మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here