అప్పుడు మద్దతిచ్చినందుకు ఇప్పుడు పశ్చాత్తపపడుతున్నా – మాజీ సీఎం వైఎస్ జగన్‌

Ex CM YS Jagan Sensational Comments on Supporting Centre For CEC Appointment Procedure

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉద్రిక్తతల మధ్య సాగుతున్న వేళ, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రంలో ఎన్నికల కమిషనర్ల నియామక విధానానికి సంబంధించి అప్పట్లో తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం పెద్ద తప్పిదమని, ఆ నిర్ణయం పట్ల ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు.

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కార్యాలయంలో ఎస్‌ఈసీ పునేఠాను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీలు నామినేట్ చేసే ప్రస్తుత పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార కూటమి పార్టీలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పులివెందులలో పోలీసులే స్వయంగా గూండాల మాదిరిగా వ్యవహరించి కాల్పులు జరిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, రిటర్నింగ్ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలీసుల తీరుపై హెచ్చరిస్తూ.. “ప్రభుత్వానికి పోలీసులు వాచ్‌మన్లుగా తయారవుతున్నారు. తప్పు చేసే ప్రతి పోలీసుకూ చెబుతున్నా.. మా కాలం వస్తుంది, అప్పుడు చట్టం ముందు దోషులుగా నిలబడతారు” అని హెచ్చరించారు.

ఈ స్థానిక ఎన్నికలు కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని, 2029 సాధారణ ఎన్నికలే తమకు అసలైన ముగింపు రేఖ అని స్పష్టం చేశారు. స్వతంత్రంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు కేంద్ర బలగాల భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎస్‌ఈసీని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here