పులివెందులకు మాజీ సీఎం వైఎస్ జగన్.. స్వయంగా నామినేషన్ల దాఖలు పర్యవేక్షణ

Former CM YS Jagan 3-Day Pulivendula Tour To Oversee MPTC and ZPTC Nominations

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ, వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా ఆయన అక్టోబర్ 21వ తేదీ నుంచి 23 వరకు మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు.

వైయస్ఆర్‌సీపీ తరఫున బరిలో నిలుస్తున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను వైఎస్ జగన్‌ స్వయంగా పర్యవేక్షించనున్నారు. గతంలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో పలు ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులకు నామినేషన్లు వేయకుండా అధికార కూటమి నాయకులు అడ్డంకులు సృష్టించారని, దాడులకు పాల్పడ్డారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పులివెందుల, పుంగనూరు, కడప, రాయచోటి వంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు. గ్రామీణ స్థానిక పోరులో అలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చూసేందుకే ఆయన స్వయంగా నియోజకవర్గంలోనే ఉండి పర్యవేక్షించాలని నిర్ణయించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నదే తమ ఉద్దేశమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడి పోటీకి దిగాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. “ఇప్పుడు వారి సమయం నడుస్తోంది.. కొడుతున్నారు, కానీ భరిద్దాం.. మళ్లీ మన సమయం వస్తుంది” అంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా నింపారు.

అక్రమాలు అరికట్టేందుకు, ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ వర్గాలకు సూచించారు. వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి నామినేషన్ల దాఖలును దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో, రాయలసీమ వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అభ్యర్థులకు మద్దతుగా జగన్ పులివెందులలోనే ఉండనుండటంతో అక్కడ రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 21 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల గడువు అక్టోబర్ 23తో ముగియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here